Tuesday, February 7, 2012

ఆటలు – పాటలు – పాఠాలుప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ జీవితంలో మరపురాని మరచిపోని మరువలేని ఘట్టం చిన్నతనం. ఏం చేసినా ఎవ్వరూ అడగరు. బిడియం, సిగ్గు, జంకు, స్వార్ధం, కోపం, ఈర్ష్య ఇవేమి ఉండవు. ఆ వయసు దాటాక ఆ రోజులు ఎప్పటికీ తిరిగి రావని ఇలా నెమరు వేసుకున్న నేను.
స్వతహాగ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అవటం వలన చదువెలాగో తప్పదు అనుకొని ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా, అమ్మా నాన్న మరియు అన్నకు తెలియకుండ ఎప్పుడెప్పుడు బయటకెళ్ళి ఆడుకుందామ అని ఎప్పుడూ ఆలోచించే రోజులవి.

కట్లాట, బొంగరాలు, గోళీలు, జిల్లాంకోడి (కర్రా-బిల్ల), లాటరీలు, కాగితాలాట  ఒకటేమిటి దాదాపుగా అన్నీ అటలాడేశాం మనం . అంతేనా కాలాలకు అనుకూలంగా వానా కాలంలో పడవలాట, సంక్రాంతి సమయంలో గాలిపటాలాట. పగలేమో ఇవన్నీన రాత్రేమో బయటుంటే డియండల్ (నాకు అత్యంత ఇష్టమైన అట :)), కరెంటు పోతే అంత్యాక్షరి (ఇది కూడ, ఇప్పటికీ తగ్గలే పిచ్చి కాకపోతే ఒక్కడినే :)).
ఇక పాఠశాలలో అయితే పి.టి పీరియడ్ వచ్చిందంటే చాలు నా సామిరంగా తర్వాత పీరియడ్ యూనిట్ పరీక్ష ఉన్నా కూడ పట్టించుకోకుండా క్రికెట్, ఫుట్‌బాల్ (అప్పట్లో క్రికెట్‌కు వాడే లబ్బరు, టెన్నిస్ బాలే మాకు అన్నీ ఆటలకు బాలు :)), హై జంపులు, లాంగ్ జంపులు, జారా బండ వగైరా ఆటలు అడే వాళ్ళం. తరగతిలో అయితే కాగితాలాట ఎక్కువ ఆడే వాళ్ళం. ఒక రోజులోనే కొన్ని నోటు పుస్తకాలు చిరిగేవి మరియు కొత్తవి ఏర్పడేవి :). ఇంక ఎల్.ఎ పీరియడ్‌లో అయితే వేదికను అలంకరించిన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు నా నమస్కారాలు, నా తోటి విద్యార్ధులకు నా శుభాకాంక్షలు. ఇప్పుడు నేను చెప్పబోవు అంశం ఏమనగా..ఇది లేనిదే మొదలవదు :). నేను స్టేజి ఎక్కితే సామాన్యంగా వదలను, అందుకే మా ఉపాధ్యాయులు నన్ను వదలరు. కాని నా స్నేహితులు మాత్రమే కొంతమంది ఇంక చాలురా అని తిట్టుకునే వాళ్ళు, ఇంకొంత మంది వదలరా బాబు మేము కూడ చెప్పాలి అని గొణుగుకునే వాళ్ళు, మరి కొంత మంది వదిలితే ఇంటికెళిపోవచ్చు అనుకునే వాళ్ళు (మరి మా ఊరి పాఠశాలల్లో అంతా ఎల్.ఎ నే చివరి పీరియడ్) :). ఇంటిచ్చేటప్పుడు గమ్మునొస్తామా కాసేపు మైదానంలో ఆడుకొని తర్వాత దారిలో కనపడిన చింత చెట్టునల్లా రాళ్ళతో కొట్టి, చెట్లెక్కి చింతకాయలు కోసుకొని తినుకుంటూ వచ్చే వాళ్ళం. ఎక్కువగా తిని నాలుక కోసుకొని పోవటం వలన ఇంట్లో తిట్లు తిన్న సందర్భాలెన్నో :).

స్టాంపుల కలెక్షను, ఆకులు, దేశాలు, చెట్లు, పూలు, దేశ నాయకులు మొదలగు వాటితో ఆల్బం తయారు చేయటాలు ఇలా ఎన్నో. వీటితో పాటు నేను క్రికెట్ ఆల్బం కూడ చేసేవాడిని, అన్ని దేశాల క్రికెటర్ల బొమ్మలు ఎక్కడ కనబడితే అక్కడ పేపరు నుండి కోసేసి తయారు చేసేవాడిని. నింజం చెప్పొద్దూ అప్పట్లో పెళ్ళిళ్ళకెళ్ళినా కూడ ఎక్కడ పేపర్ కనబడుతుందా అని వెతికేవాడిని. సచిన్ అంటే ఎంత పిచ్చంటే అప్పట్లో క్రికెటర్లందరివీ ఒక ఆల్బం అయితే సచిన్‌దే ఒక ఆల్బం ఉండేది నా దగ్గర (మీరు చూసే ఉంటారు సచిన్ చెడ్డీ వేసుకొని బ్యాట్ పట్టుకుని ఉండే చిన్నప్పటి ఫోటో, దానితో కలిపి :), నా దగ్గర పెద్ద న్యూస్ పేపర్ డబుల్ షీట్ అంత పెద్దదుండేది ఫోటో).


ఇంట్లో వాళ్ళు అరుస్తుంటే క్రింద అంగట్లో తెలియకుండ అటక మీద దాచే వాడిని. మన్మధుడు సినిమాలో ఎలాగైతే నాగార్జున పదేళ్ళ వయసులో తన దగ్గరున్న కుక్క పిల్ల చనిపోతే మళ్ళీ వాటిని ముట్టుకోలేదో అలాగే ఒకానొక ఫైన్ మార్నింగ్ (ఫైన్ అని ఎందుకన్నానంటే ఆ రోజు భోగి కనుక) నా పిచ్చిని సహించ లేక లాటరీలు, క్రికెట్ అల్బంలను మా అన్న భోగిలో వేసేశాడు (ఇప్పుడర్ధమైందా ఫైన్ మార్నింగ్ అని ఎందుకన్నానో). అంతే ఇక అప్పటి నుంచి క్రికెట్ చూడటం మానేశాను.

మనం విషయంలోకి వచ్చేద్దాం, ఆటలు అబ్బో చాలా ఉంది :). కట్లాట, జ‌ంపింగ్, డియండల్ ఇలా దేనికైనా ముందు చప్పట్లుంటాయ్. దొంగ ఎవరో తేలాలి కదా. తర్వాత, బొంగరాల ఆట అయితే గుంటూరు గుమ్మా నా ఫేవరెట్ (మరచిపోయార, అదేనండీ బొంగరం ఇక్కడ తిప్పి వేస్తే మీ ఊళ్ళో వచ్చి తిరుగుద్ది గుయ్ మని ఏరోప్లేన్ శబ్దంతో :)), కుత్తులాట ఇంకా ఫైలెట్ (బొంగరం తిప్పి వేస్తే క్రింద పడకుండా వచ్చి చేతిలో పడుతుంది :)). లాటరీలాటకొస్తే అచ్చా-బొమ్మా. గోళీలాటకొస్తే చాలా రకాలున్నాయి, పేర్లు గుర్తు లేవు.

ఇప్పుడు ఆలోచిస్తుంటే ఓ నవ్వు, ఎన్నో తీపి గురుతులు మరెన్నో అనుభవాలు మనందికీ ఉంటాయి. మొన్న నేను మా సహ ఉద్యోగి వాళ్ళ ఇంటికి లంచ్ కెళ్ళా. వాళ్ళ అబ్బాయ్ సీరియస్‌గా మాతో ఏమీ మాట్లాడకుండా టీ.వీ లో క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పట్లో మామూలే అనుకొని ఏరా ఏం చేస్తున్నావ్ అంటే సండే కదా అన్నా క్రికెట్ వీడియే గేమ్ ఆడుతున్నా అన్నాడు. బయట కెళ్ళి ఆడుకోవచ్చు కదా మీ స్నేహితులతో అంటే, మా ఫ్రెండ్స్ కూడ ఆడుతూనే ఉంటారన్నా వాళ్ళింట్లో, అయినా బయట ఎండ కదా అన్నాడు. అతని సమాధానంలోంచి వచ్చిందే ఈ టపా. అతని జవాబుని తరంలో మార్పు అనాలా, పరిఙ్ఞాణం అనాలా లేక మనలో మార్పు అనాలా?. ఒకా సారి ఊహించండి మనం గడిపిన బాల్యపు జీవన విధానంలో కనీసం కొంతైనా మన తర్వాతి తరాల వారికి అందుబాటులో ఉంటే ఎలా ఉంటుంది. అన్నీ కుదరవు, మనందరికి తెలిసిందే కానీ కుదిరేటివి కూడ వాళ్ళకి అందనీయకుండ చేయటం, అసలు ఆ ధ్యాసే వాళ్ళలో కలగకుండ పోవటం నిజంగా మన దురదృష్టం.