Wednesday, March 2, 2011

మహా శివ రాత్రి శుభాకాంక్షలు


(From Today's Eenadu Paper)
అన్యోన్యతకు ఆది దంపతులు
బంగారు నాణెమైనా రెండు పార్శ్వాలుంటేనే చెల్లుబాటు. భార్యాభర్తలూ అంతే. చంద్రుడు.. వెన్నెల; సముద్రం.. కెరటం; దీపం.. కాంతి; చక్కెర... తీపి... పేరుకి రెండైనా వాటినెలా విడదీయలేమో పార్వతీ పరమేశ్వరుల్ని సైతం అలా వేరుగా చూడలేం. నగ సుతకు సగ దేహాన్ని కల్పించిన శంకరుడు... ఎందరు ఆక్షేపించినా శివుడే నా భర్త అన్న పార్వతిల అవిభాజ్య అనురాగం నుంచి ఆలుమగలు ఎన్నో విషయాలను గ్రహించవచ్చు.


ర్థనారీశ్వరతత్వం.. భార్యాభర్తల అనుబంధాన్ని తెలియజేస్తుంది. పార్వతీ పరమేశ్వరులిద్దరూ తల నుంచి పాదం వరకు ఆపాదమస్తకం ఒకే రూపంలో ఉంటారు. ఇక, తల ఆలోచనకు సంకేతమైతే.. పాదాలు ఆచరణకు సంకేతం. భార్యాభర్తలు ఆలోచన, ఆచరణ సరిసమానంగా చేయడం.. అర్థనారీశ్వరతత్వాన్నుంచి నేర్చుకోవాలి.
మనసులు కలవడమే ముఖ్యం... ఆది దంపతుల ఆహార్యం పూర్తి విభిన్నం. శంకరుడు ఎర్రని రాగి జుట్టుతో ఉంటే.. అమ్మవారు చంపక, అశోక, పున్నాగ పుష్పాలతో అందమైన కొప్పును అలంకరించుకుంటుంది. ముక్కంటి భగభగ మండే నిప్పులతో రౌద్ర రూపుడైతే అమ్మవారు ప్రశాంతంగా ఉంటుంది. శివుడు బుసకొట్టే పామును అలంకరించుకుంటే.. ఆమె రత్రగ్రేవేయ హారం ధరిస్తుంది. శివుడు గజచర్మం కట్టుకుంటే, పార్వతీ దేవి పట్టు వస్త్రం ధరిస్తుంది. ఇలా ఇద్దరూ విభిన్నంగానే కనిపిస్తారు. అయినా 'నాలా నువ్వు ఎందుకు ఉండవు.. నీలా నేనెందుకు ఉండకూడదు' అని అనుకోరు. అవతలి వ్యక్తిని యథాతథంగా స్వీకరించి, గౌరవించే అరుదైన అన్యోన్యతకు అనన్య ఉదాహరణ వారు. రూపం కాదు, మనసులు కలవడమే ముఖ్యం అనేది ఆది దంపతులు అందించే స్ఫూర్తి.
ఎక్కువ తక్కువల లెక్కలు లేవు... భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువ విజ్ఞానవంతులు, ప్రతిభాసంపన్నులు అయితే రెండో వారిలో ఈర్ష్యాసూయలు మొదలవుతాయి. భాగస్వామిలో గొప్పతనాన్ని గుర్తించి అభినందించాలి. కానీ పోలిక తెచ్చుకొని, లోపాలను వెతికే పరిస్థితులు నానాటికీ అధికం అవుతున్నాయి. ఇది గోరంతదే కావచ్చు. కానీ చినికి చినికి గాలివాన అయిన సందర్భాలు చూస్తూనే ఉన్నాం. పార్వతీ పరమేశ్వరులు అందుకు పూర్తి విభిన్నం. శివుడికి వ్యోమకేశ అని పేరు. వ్యోమము అంటే ఆకాశం. కేశాలంటే శిరోజాలు. కురులు బహు సూక్ష్మంగా ఉంటాయి. ఆకాశంలో దాగిన అంత సూక్ష్మమైన రహస్యాలు సైతం తెలిసిన వాడు పరమేశ్వరుడు. శివుడి తల ఆకాశం. అందుకే గంగ, చంద్రుడు అక్కడ ఉంటారు. ఆకాశం నుంచే నిప్పు పుడుతుంది. అగ్ని జ్ఞానానికి సంకేతం.శివుడి మూడోకన్ను అదే సూచిస్తుంది. జ్ఞానమే చిదగ్ని. ఇది ప్రతివ్యక్తిలోనూ ఉంటుంది. ఆలోచించిన కొద్దీ వృద్ధి చెందుతుంది. ఇంత తెలిసిన వాడు కనుకే శివుణ్ని సర్వజ్ఞహ అని అంటారు. అయినా ఆయన అన్నీ నాకే తెలుసని అనుకోడు. సతీమణి పార్వతిని తనకన్నా జ్ఞానవంతురాలిగా భావించి, జ్ఞానభిక్ష పెట్టమంటూ నిత్యం అడుగుతాడు. అర్థాంగిని సంప్రదించే, విద్యను గౌరవించి ప్రోత్సహించే తీరుని అది తెలుపుతుంది.
ప్రేమంటే అదేలే... శివుణ్ని భర్తగా పొందాలని పార్వతి తపస్సు చేసింది. బంధుజనం అంతా వారించారు. గేలి చేశారు. ఆఖరుకి శంకరుడు కూడా మాయా బ్రహ్మచారి రూపంలో వచ్చి.. ఆమెకు పరీక్ష పెడతాడు. అతనికి ఇల్లు లేదు. కన్నవారు లేరు. భిక్షాటన చేస్తాడు... అంటూ తనకు సంబంధించిన రహస్యాలను ఎలాంటి దాపరికం లేకుండా వివరిస్తాడు. శివుడి గురించి అప్పటి వరకు పార్వతికి ఇవన్నీ తెలియదు. కానీ అంతా విన్నాక కూడా ఆమె మనసు మారదు. అతణ్నే పెళ్లాడింది. అలా సిరిసంపదలు, ధనధాన్యాలకన్నా.. మనసు, మమత, ప్రేమాప్యాయతలే జీవితం, వాటితోనే ఆనందం అన్న సందేశం చాటారు.
మాటా.. మనసూ ఒకటే భార్యాభర్తలిద్దరూ వేర్వేరు కాదు. ఒకటే. ఒకరికి గౌరవ భంగం జరిగితే అది ఇద్దరికీ జరిగినట్టే. పుట్టింటి మీద మమకారంతో దక్ష యజ్ఞానికి వెళ్లిన దాక్షాయణి అవమానానికి గురవుతుంది. భర్త మాట కాదన్నందుకు బాధపడుతుంది. వేదనతో ఆత్మాహుతి చేసుకుంటుంది. అర్థాంగికి అలా జరగడాన్ని తట్టుకోలేక శివుడు ప్రళయకాల రుద్రుడయ్యాడు. సతీదేవి మృతదేహాన్ని మోసుకొంటూ దిక్కు తోచక పద్నాలుగు లోకాలూ కలియతిరుగుతూ ఆమెపై ప్రేమను ప్రకటించాడు. దాక్షాయణి చేసినది సరైనదేనని తరవాత దక్షుడు కూడా అంగీకరిస్తాడు.
-వినా-భావ సంబంధం 'జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ' అంటారు. వీళ్లిద్దరూ వాక్కు అని అర్థం. శివుడు మాట అయితే.. పార్వతి అర్థం. అర్థంలేని మాట ఉండదు. మాట్లాడితే అర్థం రాకుండా ఉండదు. అంటే.. ఒకరు లేక మరొకరు లేని స్థితి వాళ్లద్దరిదీ. దాన్నే -వినా-భావ సంబంధం అంటారు. పార్వతి లేక పరమేశ్వరుడు లేడు. దంపతులు కూడా అలాగే ఉండాలి. ఒకరికొకరుగా... ఒకే మాట, ఒకే ఆలోచనగా భర్త చేసే పనిని గౌరవించే లక్షణం భార్యకు ఉండాలి. అదే నిజమైన దాంపత్యం అనిపించుకుంటుంది.
మౌనం.. ధ్యానం.. పరమార్థం తల్లిదండ్రుల నుంచే పిల్లలకు పద్ధతులు అబ్బుతాయి. గౌరీశంకరుల నుంచి మనం నేర్చుకుని, పిల్లలకు బోధించే రెండు అంశాలున్నాయి. అద్దం ముందు నిల్చొని నవ్వడం సాధన చేయమనడం, పిల్లలకు ఒకేసారి విద్య, విజ్ఞానం వచ్చేయాలని ఆరాటపడటంలో ఔచిత్యం ఎంత? శంకరుడు ఏనుగు, పులి చర్మం ధరిస్తాడు. అవి రజో (అకస్మాత్తుగా కోపం రావడం), తమో (అప్పుడేం చేస్తున్నామో విచక్షణ లేకపోవడం) గుణాలకు సంకేతం. రెంటినీ శివుడు అదుపులో ఉంచి ప్రసన్న వదనంతో ఉంటాడు. అది కావాలని తెచ్చుకున్న నవ్వు కాదు. కృత్రిమమైనది అంతకన్నా కాదు. మౌనం, ధ్యానంతో పెదవులపై సహజంగా విచ్చుకున్న చిరునవ్వు. అమ్మవారూ అంతే! జ్ఞాన ప్రసూనాంబ. సూనము అంటే నిదానంగా వికసించేది అని అర్థం. జ్ఞానం అనేది నెమ్మదిగా కలిగేది. క్రమేపీ పెరిగేది. ఆనందం అభివృద్ధి బాటలో నడవడానికి సహజ ప్రక్రియలను పాటించాలి. అంచలంచెలుగా విజ్ఞాన వృద్ధి సాధించాలి అని దానర్థం.
Happy Shiva Rathri.. 


4 comments:

శివ చెరువు said...

మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ .. శివ రాత్రి పర్వదిన శుభాకాంక్షలు.. శివ చెరువు

గిరీష్ said...

@శివ చెరువు,
ధన్యవాదములు. మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు

శిశిర said...

చాలా informative గా రాశారు. బాగుంది టపా. బొమ్మ కూడా చాలా బాగుంది.

గిరీష్ said...

@sisira garu,
thanks