అవి నేను పదవ తరగతి చదువుతున్న రోజులు. మా పాఠశాలలో స్కాలర్షిప్పు పొందటానికి Income Certificate ని ఇవ్వవలసి ఉంటే మా ఊరు మండల ఆఫీసులో ఎమ్.ఆర్.ఓ గారికి అర్జీ పెట్టాను. వెళ్ళగానే బాబు నేను ఇనిషియల్ వేయిస్తాను. నువ్వు వెళ్ళి వి.ఎ.ఓ ని కలువు. ఆయన సంతకం చేసిన తర్వాత ఆర్.ఐ. ని కలువు. ఆయన సంతకం చేస్తే మళ్ళీ ఈ దరకాస్తు నా దగ్గరకు వస్తుంది. అప్పుడు నేను నీకు Income Certificate ఇస్తాను అన్నారు. సరేనని వి.ఎ.ఓ గారు ఎక్కడుంటారో తెలుసుకొని ఆయన ఉన్న చోటుకి వెళ్తే ఆయన నువ్వు ఈ ఊర్లో ఎన్నేళ్ళుగ ఉన్నావు, ఎక్కడ మీ ఇళ్ళు, మీ తల్లిదండ్రులెవరు అని కొన్ని ప్రశ్నలడిగి, నా దరకాస్తుని ఆర్.ఐ. గారికి ఫార్వార్డ్ చేశారు. తర్వాత ఆర్.ఐ గారు దాదాపుగ మళ్ళీ అవే ప్రశ్నలు అడిగి ఎమ్.ఆర్.ఓ గారికి పంపించారు. మొత్తానికి నాకు సర్టిఫికేట్ వచ్చింది. కాని ఆ సమయానికే పాఠశాలలో సర్టిఫికేట్ ఇవ్వవలసిన గడువు తేదీ దాటిపోవటంతో అది ఉపయోగపడలేదు. నాకు అప్పుడు అర్ధం కాలేదు కానీ, తర్వాత ఆలోచిస్తే నాకు మండలాఫీసులో Income Certificate తీసుకోవటానికి పట్టిన సమయం ఎనిమిది నెలలు పైనే. మొదట నవ్వొచ్చింది. చొప్పులు అరిగిపోయేలా తిరిగాను. ఎండ, వానను లెక్కచేయకుండ తిరిగాను. (ఇప్పుడు తిరగలేననుకోండి, అవసరం కూడ లేదు). అప్పుడు నాకు లంచం, బ్రోకర్ అనే వాటి గురించి అంతగా తెలియదు. తెలిసునుంటే రెండోరోజే నాకు సర్టిఫికెట్ వచ్చుండేది. అప్పుడు తెలియకపోవటమే ఇప్పుడు సంతోషాన్నిస్తుంది
మా ఇంటి ఎదురుగ మేరీ అనే ఒకావిడ ఉండేది. ప్రభుత్వ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్. కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించింది. వచ్చిన ప్రజలకు పెంక్షను తాలూకు డబ్బులు ఇచ్చి, కంప్యూటర్‌లో ఆ లెక్కలను పొందుపరచటం ఆమె పని. లంచం తీసుకునేది కాదు, ఇష్టం లేదు. ఆమె పై అధికారి రోజు ఐదువేలు ఇంటికి పట్టుకెళతాడు. ఆయన మాత్రం జనాల దగ్గర లంచం తీసుకోడు. ఆయన చెప్పేది ఒకటే అతని క్రింద పనిచేసే ఉద్యోగులకి, "నాకెవ్వరిస్తారు. మీరు వచ్చే జనాల దగ్గర డబ్బులు తీసుకోండి, దానిలో కొంత నాకివ్వండి". ఓ రోజు భర్తను పోగొట్టుకున్న ఒక మహిళ, తన భర్త పెంక్షనును తన పేరు మీద మార్చుకోవటానికి ఆఫీసుకొస్తే, మేరీ గారు అలాగే మార్చి ఆమెకు పెంక్షను ఇచ్చారు. లెక్కలో కొద్దిగ తప్పు కూడి ఆమెకు ప్రతినెలా ఐదువేలు ఎక్కువ ఇచ్చేవారు. ఇలా పదినెలలు సాగింది. పెంక్షను తీసుకునే మహిళ ఏమో తనకేమి తెలియదు అన్నట్టు ఎక్కువ వచ్చినా తీసుకునేది. స్క్వాడ్‌కి వచ్చిన ఆ ఏరియా ఎమ్.ఆర్.ఓ ఈ విషయాన్ని కనుకొన్ని మేరీ గారిని అడిగితే చూసుకోలేదు సార్ అని చెప్పి కాస్త ఫీల్ అయ్యి వెళ్ళి పెంక్షను తీసుకునే ఆమెను అడిగితే, నాకేం తెలుసమ్మా మీరిస్తున్నారు నేను తీసుకుంటున్నా అంది. డబ్బులు తిరిగి కట్టమంటే నా దగ్గరలేవు కట్టమంది. అప్పుడు మేరీ గారు సరేనమ్మ నేను ఈ కేసుని కోర్టుకి వేస్తాను. అక్కడే తేల్చుకుందాం అని కోప్పడగ భయపడ్డ ఆమె ఎక్కువ వచ్చిన డబ్బులను తిరిగిచ్చింది. కానీ ఎమ్.ఆర్.ఓ గారు ఇలా అన్నారు. "చూడమ్మా, నువ్వు ఎక్కువిచ్చావ్, ఆమె తిరిగిచ్చింది. కానీ ఈ విషయాన్ని నేను కనిపెట్టాను, నేను ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియపరచ కుండా ఉండాలంటే నువ్వు నాకు ఏదైనా ఇవ్వాలి. ఏ ఇరవైదు వేలు సద్దావంటే నేను ఈ విషయాన్ని ఎక్కడా చెప్పను". ఇంక ఆ తర్వాత దిక్కు తోచని మేరీగారు ఏం చేసుంటారో చెప్పక్కర్లేదు.
ఇలా చెప్పుకుంటూ పోతే అపరిచితుడు, బ్రోకర్ లాంటి సినెమాలు ఎన్నో తీయొచ్చు. ప్రభుత్వ ఆఫీసు అంటే ముందు లంచం, ఆ తర్వాతే పని. అది ఏ శాఖ అయినా సరే. ప్రైవేటు కార్యాలయాల్లో లేవని కాదు. కాని (పెద్ద పదమేమో) దేశాన్ని పరిపాలించేది ప్రభుత్వమే కదా. నేరుగా వెళితే పని తొందరగా అవ్వట్లేదని ఇలా అడ్డదారిలో వెళ్తున్నాం. కొంచెం డబ్బు పోతుంది. కానీ ఖచ్చితంగా పనవుతుంది. ఆ తర్వాత మనము ఇచ్చినదానికంటే ఎన్నో రెట్లు తీసుకోవచ్చు. అడిగే వాడెవ్వడు, అడ్డు చెప్పే వాడెవ్వడు అని మన వాళ్ళ ధీమా. ఇలా దేశంలో సగానికి పైగా డబ్బు నలుపు రూపంలోనే ఉంటే, ఇంక డాలరుకి యాభై మూడేంటి, నూట యాభై మూడైనా పెద్దగా ఆశ్యర్య పోవలసిన అవసరం లేదు. అయినా మనం పనిచేసే ఐ.టి ఉద్యోగాలు కూడ వాళ్ళకు డబ్బులు తెచ్చిపెట్టి మన రూపాయి విలువ తగ్గించేవే కదా... రేపు ఎలా బ్రతకాలో అని ఒక భయం, మనకు ఏమీ కానంత వరకు ఏమైనా పర్వాలేదు అనే ఒక స్వార్ధం. ఒక్క సారి ఆ మోజులో పడ్డాక అన్ని సినెమాల్లో చెబుతున్నట్టు మన తర్వాత తర్వాత తరాల వాళ్ళు కూర్చొని తిన్నా తరగనంత. సులువైన మార్గం లంచం. నిజాయితీగా కూడ ఇలా సంపాదించచ్చు. కానీ సమయం పడుతుంది. అంత ఓపిక, ఆత్మ విశ్వాసం లేకపోవటం వళ్ళనే ఇవన్నీ.
నేనేదో వీటికన్నీ వ్యతిరేకంగా/అనుకూలంగా ఉన్నానని ఈ టపా అర్ధం కాదు. అలా బ్రతకలేము అనికూడ నాకు ఇప్పుడిప్పుడే అర్ధం అవుతుంది. కాని నా వంతుగా నేను చేయ దలచుకున్నదేమిటంటే, సాధ్యమైనంత వరకు లంచం ఇవ్వటానికి నిరాకరించండం, ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా పని పూర్తవ్వటం కోసం వేచి ఉండటం. మీకు తెలిసినవి చెప్పండి. ప్రయత్నిస్తాను.
తప్పేమైనా బనియన్ సైజా స్మాల్, మీడియం, లార్జ్ అని చెప్పటానికి; అయినా రిజల్ట్స్ చూడండి అన్నీ ఎక్స్‌ట్రా లార్జులే.
(అపరిచితుడు లో విక్రమ్)
మనిషి మారటానికి అవకాశం రావటం ముఖ్యం కాదు.. ఆ అవకాశాన్ని గుర్తించటం ముఖ్యం.
(బ్రోకర్ సినెమాలో ఆర్.పి)