Tuesday, February 7, 2012

ఆటలు – పాటలు – పాఠాలు



ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ జీవితంలో మరపురాని మరచిపోని మరువలేని ఘట్టం చిన్నతనం. ఏం చేసినా ఎవ్వరూ అడగరు. బిడియం, సిగ్గు, జంకు, స్వార్ధం, కోపం, ఈర్ష్య ఇవేమి ఉండవు. ఆ వయసు దాటాక ఆ రోజులు ఎప్పటికీ తిరిగి రావని ఇలా నెమరు వేసుకున్న నేను.
స్వతహాగ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అవటం వలన చదువెలాగో తప్పదు అనుకొని ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా, అమ్మా నాన్న మరియు అన్నకు తెలియకుండ ఎప్పుడెప్పుడు బయటకెళ్ళి ఆడుకుందామ అని ఎప్పుడూ ఆలోచించే రోజులవి.

కట్లాట, బొంగరాలు, గోళీలు, జిల్లాంకోడి (కర్రా-బిల్ల), లాటరీలు, కాగితాలాట  ఒకటేమిటి దాదాపుగా అన్నీ అటలాడేశాం మనం . అంతేనా కాలాలకు అనుకూలంగా వానా కాలంలో పడవలాట, సంక్రాంతి సమయంలో గాలిపటాలాట. పగలేమో ఇవన్నీన రాత్రేమో బయటుంటే డియండల్ (నాకు అత్యంత ఇష్టమైన అట :)), కరెంటు పోతే అంత్యాక్షరి (ఇది కూడ, ఇప్పటికీ తగ్గలే పిచ్చి కాకపోతే ఒక్కడినే :)).
ఇక పాఠశాలలో అయితే పి.టి పీరియడ్ వచ్చిందంటే చాలు నా సామిరంగా తర్వాత పీరియడ్ యూనిట్ పరీక్ష ఉన్నా కూడ పట్టించుకోకుండా క్రికెట్, ఫుట్‌బాల్ (అప్పట్లో క్రికెట్‌కు వాడే లబ్బరు, టెన్నిస్ బాలే మాకు అన్నీ ఆటలకు బాలు :)), హై జంపులు, లాంగ్ జంపులు, జారా బండ వగైరా ఆటలు అడే వాళ్ళం. తరగతిలో అయితే కాగితాలాట ఎక్కువ ఆడే వాళ్ళం. ఒక రోజులోనే కొన్ని నోటు పుస్తకాలు చిరిగేవి మరియు కొత్తవి ఏర్పడేవి :). ఇంక ఎల్.ఎ పీరియడ్‌లో అయితే వేదికను అలంకరించిన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు నా నమస్కారాలు, నా తోటి విద్యార్ధులకు నా శుభాకాంక్షలు. ఇప్పుడు నేను చెప్పబోవు అంశం ఏమనగా..ఇది లేనిదే మొదలవదు :). నేను స్టేజి ఎక్కితే సామాన్యంగా వదలను, అందుకే మా ఉపాధ్యాయులు నన్ను వదలరు. కాని నా స్నేహితులు మాత్రమే కొంతమంది ఇంక చాలురా అని తిట్టుకునే వాళ్ళు, ఇంకొంత మంది వదలరా బాబు మేము కూడ చెప్పాలి అని గొణుగుకునే వాళ్ళు, మరి కొంత మంది వదిలితే ఇంటికెళిపోవచ్చు అనుకునే వాళ్ళు (మరి మా ఊరి పాఠశాలల్లో అంతా ఎల్.ఎ నే చివరి పీరియడ్) :). ఇంటిచ్చేటప్పుడు గమ్మునొస్తామా కాసేపు మైదానంలో ఆడుకొని తర్వాత దారిలో కనపడిన చింత చెట్టునల్లా రాళ్ళతో కొట్టి, చెట్లెక్కి చింతకాయలు కోసుకొని తినుకుంటూ వచ్చే వాళ్ళం. ఎక్కువగా తిని నాలుక కోసుకొని పోవటం వలన ఇంట్లో తిట్లు తిన్న సందర్భాలెన్నో :).

స్టాంపుల కలెక్షను, ఆకులు, దేశాలు, చెట్లు, పూలు, దేశ నాయకులు మొదలగు వాటితో ఆల్బం తయారు చేయటాలు ఇలా ఎన్నో. వీటితో పాటు నేను క్రికెట్ ఆల్బం కూడ చేసేవాడిని, అన్ని దేశాల క్రికెటర్ల బొమ్మలు ఎక్కడ కనబడితే అక్కడ పేపరు నుండి కోసేసి తయారు చేసేవాడిని. నింజం చెప్పొద్దూ అప్పట్లో పెళ్ళిళ్ళకెళ్ళినా కూడ ఎక్కడ పేపర్ కనబడుతుందా అని వెతికేవాడిని. సచిన్ అంటే ఎంత పిచ్చంటే అప్పట్లో క్రికెటర్లందరివీ ఒక ఆల్బం అయితే సచిన్‌దే ఒక ఆల్బం ఉండేది నా దగ్గర (మీరు చూసే ఉంటారు సచిన్ చెడ్డీ వేసుకొని బ్యాట్ పట్టుకుని ఉండే చిన్నప్పటి ఫోటో, దానితో కలిపి :), నా దగ్గర పెద్ద న్యూస్ పేపర్ డబుల్ షీట్ అంత పెద్దదుండేది ఫోటో).


ఇంట్లో వాళ్ళు అరుస్తుంటే క్రింద అంగట్లో తెలియకుండ అటక మీద దాచే వాడిని. మన్మధుడు సినిమాలో ఎలాగైతే నాగార్జున పదేళ్ళ వయసులో తన దగ్గరున్న కుక్క పిల్ల చనిపోతే మళ్ళీ వాటిని ముట్టుకోలేదో అలాగే ఒకానొక ఫైన్ మార్నింగ్ (ఫైన్ అని ఎందుకన్నానంటే ఆ రోజు భోగి కనుక) నా పిచ్చిని సహించ లేక లాటరీలు, క్రికెట్ అల్బంలను మా అన్న భోగిలో వేసేశాడు (ఇప్పుడర్ధమైందా ఫైన్ మార్నింగ్ అని ఎందుకన్నానో). అంతే ఇక అప్పటి నుంచి క్రికెట్ చూడటం మానేశాను.

మనం విషయంలోకి వచ్చేద్దాం, ఆటలు అబ్బో చాలా ఉంది :). కట్లాట, జ‌ంపింగ్, డియండల్ ఇలా దేనికైనా ముందు చప్పట్లుంటాయ్. దొంగ ఎవరో తేలాలి కదా. తర్వాత, బొంగరాల ఆట అయితే గుంటూరు గుమ్మా నా ఫేవరెట్ (మరచిపోయార, అదేనండీ బొంగరం ఇక్కడ తిప్పి వేస్తే మీ ఊళ్ళో వచ్చి తిరుగుద్ది గుయ్ మని ఏరోప్లేన్ శబ్దంతో :)), కుత్తులాట ఇంకా ఫైలెట్ (బొంగరం తిప్పి వేస్తే క్రింద పడకుండా వచ్చి చేతిలో పడుతుంది :)). లాటరీలాటకొస్తే అచ్చా-బొమ్మా. గోళీలాటకొస్తే చాలా రకాలున్నాయి, పేర్లు గుర్తు లేవు.

ఇప్పుడు ఆలోచిస్తుంటే ఓ నవ్వు, ఎన్నో తీపి గురుతులు మరెన్నో అనుభవాలు మనందికీ ఉంటాయి. మొన్న నేను మా సహ ఉద్యోగి వాళ్ళ ఇంటికి లంచ్ కెళ్ళా. వాళ్ళ అబ్బాయ్ సీరియస్‌గా మాతో ఏమీ మాట్లాడకుండా టీ.వీ లో క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పట్లో మామూలే అనుకొని ఏరా ఏం చేస్తున్నావ్ అంటే సండే కదా అన్నా క్రికెట్ వీడియే గేమ్ ఆడుతున్నా అన్నాడు. బయట కెళ్ళి ఆడుకోవచ్చు కదా మీ స్నేహితులతో అంటే, మా ఫ్రెండ్స్ కూడ ఆడుతూనే ఉంటారన్నా వాళ్ళింట్లో, అయినా బయట ఎండ కదా అన్నాడు. అతని సమాధానంలోంచి వచ్చిందే ఈ టపా. అతని జవాబుని తరంలో మార్పు అనాలా, పరిఙ్ఞాణం అనాలా లేక మనలో మార్పు అనాలా?. ఒకా సారి ఊహించండి మనం గడిపిన బాల్యపు జీవన విధానంలో కనీసం కొంతైనా మన తర్వాతి తరాల వారికి అందుబాటులో ఉంటే ఎలా ఉంటుంది. అన్నీ కుదరవు, మనందరికి తెలిసిందే కానీ కుదిరేటివి కూడ వాళ్ళకి అందనీయకుండ చేయటం, అసలు ఆ ధ్యాసే వాళ్ళలో కలగకుండ పోవటం నిజంగా మన దురదృష్టం.



18 comments:

రసజ్ఞ said...

ఒక్కసారి చిన్నతనం అంతా కళ్ళముందు కదిలింది! బయట ఎండా, వానా పట్టించుకోకుండా ఇంటికొచ్చిన వెంటనే తిట్లు పడతాయని తెలిసి కూడా తెగ ఆడిన రోజులున్నాయి. ఈ కాలంలో చాలా మందికి ఆటలంటే కంప్యూటరు లేదా వీడియో గేమ్స్, ప్లే స్టేషను అంతే! ఏవండీ వీటన్నిటితో పాటు ఎవరో ఒకళ్ళ తోటలోకెళ్ళి మామిడికాయలు, జామకాయలు దొంగతనాలు కూడా!

Anonymous said...

good

రాజ్ కుమార్ said...

వహ్ వా.. what a post girish?

కట్లాట, బొంగరాలు, గోళీలు, జిల్లాంకోడి (కర్రా-బిల్ల), లాటరీలు, కాగితాలాట ఒకటేమిటి దాదాపుగా అన్నీ అటలాడేశాం మనం . అంతేనా కాలాలకు అనుకూలంగా వానా కాలంలో పడవలాట, సంక్రాంతి సమయంలో గాలిపటాలాట. పగలేమో ఇవన్నీన రాత్రేమో బయటుంటే డియండల్ (నాకు అత్యంత ఇష్టమైన అట :)), కరెంటు పోతే అంత్యాక్షరి (ఇది కూడ, ఇప్పటికీ తగ్గలే పిచ్చి కాకపోతే ఒక్కడినే :)).>>>


నువ్ చెప్పిన లిస్ట్ లో నేను ఆడనివి గోళీలూ, బొంగరాలూను. మిగిలిన పోస్ట్ కి పెద్ద బింగో.

వీటితో పాటూ నేను దారుణమ్ గా ఆడిన ఆట "ఏడు పెంకులాట". ఒక్కమాట లో చెప్పాలంటే ఆ ఆట ఆడ్డానికే స్కూల్ కి వెళ్ళేవాడిని. ఎండా,వానా, ఏం పట్టిమ్చుకునేవాడిని కాను.

సచిన్ ఆల్బం అంటే గుర్తొచ్చింది. అప్పట్లో బిగ్ ఫన్ బబూల్ గమ్స్ కొంటే క్రికెట్ కార్డ్స్ ఇచ్చేవాడు. వాటి మీద ఒక్కో కార్డ్ మీదా ఒక్కో క్రికెటర్ వీ ప్రొఫైల్స్ ఉండేవి. తెగ ఆడేసేవాళ్ళం. కాగితాలాట లాగానే అది కూడా.

స్టాంప్స్, ఆల్బంస్ మంటల్లో వేసెయ్యటం దారుణం ;(

చింతకాయల్ అయితే చెప్పక్కరలేదు. ఉప్పు, కారం అద్దుకొని రోజూ కుమ్మేశేవాళ్ళం. ;)

వీడియోగేంస్ కి వస్తే సూపర్ మారియోని చావగొట్టాను ;)

చాలా ఎక్కువ రాసేసినట్టున్నా... ఆగటం లేదబ్బాయ్ ;)

శోభ said...

బొంగరాలు, గోళీలు, కర్రాబిళ్ల ఆటలు, అచ్చినకాయలు..... చిన్నప్పుడు ఎంత ఇష్టంగా ఆడేవాళ్లమో... నువ్వు ఆడపిల్లవే... గోళీలలు, కర్రాబిళ్ల, బొంగరాల ఆటలు ఆడకూడదని మా అమ్మ ఎంత మొత్తుకున్నా వినేదాన్ని కాదు. మాట వినలేదని అమ్మ ఓసారి చేయి చేసుకుంది కూడా...

అయినా వినకుండా ఆడేదాన్ని... అయితే వయసు పెరిగేకొద్దీ నేనే తెలుసుకుని అటువైపు వెళ్లేదాన్ని కాను.... నిజంగా బాల్యం ఎంత అందమైనది, అద్భుతమైనదో కదండీ.....

బాల్యంలోకి మీ టపా నన్ను పరుగులు పెట్టించింది గిరీష్‌గారూ....

వేణూశ్రీకాంత్ said...

హహహ బాగుంది గిరీష్...
భోగి మార్నింగ్ ఫైర్ మార్నింగ్ కూడా కదా :-)

Manoj said...

గిరీష్ టపా సూపరు, అవును చిన్నప్పుడు లైఫ్ అంటే లైఫే
నాది సర్కారి బడి సో మాకు ఇంక అవధులు ఉండవు, కావాలి అంటే స్కూల్ లేదంటే అటలు
మా అమ్మ నాన్నలకు నేను థాంక్స్ చెప్పాలి ఏందుకంటే వాళ్ళు నన్ను ఎప్పుడు చదువుకోరా అని ఇబ్బంది పెట్టలేదు, గొలీలాట లో ఆడినవి షిడ్డి, పికొడి, కొట్టి జాన, అబ్బొ ఇంకా చాలా ఉన్నాయ్..

గిరీష్ said...

@రసజ్ఞ గారు,
అవునండీ, బాల్యం ఓ అద్భుతం. మరళరానిది, మరపు రానిది.. ఇప్పటి పిల్లలు పరిస్థితి చూస్తే బాధాకరం. హా..అలాంటి చిన్న చిన్న దొంగతనాలు నా ఖాతాలో కూడా ఉన్నాయ్..ధన్యవాదములు మీ వాఖ్యకి.. :)

@kastephale గారు,
thanks for the comment.. :)

గిరీష్ said...

@రాజ్,
నా టపా కన్నా పేద్దది నీ వాఖ్య..:), thanks for sharing. అవును కొన్ని సార్లు ఆడుకునేందుకే పాఠశాలకి వెళ్ళే వాళ్ళం. హా, బిగ్ బబూల్ కలెక్షన్ సూపర్ అసలు, ఎన్నెన్ని బొమ్మలో బబుల్‌గమ్ వాసనతో.. ).
ఏం చేస్తాం నా పిచ్చి పీక్స్ కెళ్ళింది మరి, వాళ్ళు నయం చేశారు అలా..
హా..సాయంత్రం చింతకాయల కోసం పొద్దున ఇంటి నుండి వచ్చేటప్పుడు ఉప్పు, కారం సంచిలో పెట్టుకొని రావటం గుర్తే..,
ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో టపా అయ్యేలా ఉంది :)..thanks.

గిరీష్ said...

@శోభ గారు,
మీరు సూపరసలు.. :), ఆ రోజులు మళ్ళీ రావండి.
మీకు ఒకసారే, నాకు చాలా సార్లు చేతులు, కాళ్ళు కూడ చేసుకున్నారు మా ఇంట్లో.. :).
నా టపా మీ బాల్యాన్ని మీకు మరొకసారి గుర్తు చేసినందుకు సంతోషం.., thank you.

గిరీష్ said...

@వేణూ గారూ,
:), ఏం చేస్తాం, ఆ రోజు అలా జరుగుతుందని తెలిసుంటే, ఇప్పటికి నా దగ్గర ఆ ఆల్బంలు ఉండేటివి..., thanks for the comment.

@Manoj,
మాది కూడ అదే బడి బాబు అందుకే అలా ఎంజాయ్ చెయ్యగలిగాను. మనిద్దరికి ప్రాంతీయ బేధాలున్నాయి అనుకుంటా :), నువ్వు చెప్పిన గోళీలాట పేర్లు నాకు తెలియదు..thank you.

రాజ్ కుమార్ said...

ఇంకొన్ని గుర్తొచ్చింది గిరీషూ..
కాగితాలని బాల్ లాగ చుట్టీ, పరీక్ష అట్టలతో రెండు టీములుగా విడిపోయి షటిల్ ఆడేవాళ్ళం ;)

పిచ్చిబంతి {జోరుబంతి} కూడా సూపరు. తెలుసా? బాల్ పట్టుకొని ఎవన్ణీ పడితే వాణ్ణి కొట్టెయ్యడమే.. బాల్ దొరికినోడిది చాన్స్ ;)

కొబ్బరి మట్ట తో క్రికెట్...

తాటి కాయతో బండ్లు, వాటితో పోటీలు.. ;)

గూటిబిళ్ళ ఆడాను గానీ చాలా తక్కువ. మా నాన్న ఆడనిచ్చేవారు కాదు. బిళ్ళ కంటికి తగులుద్దని భయం.. ;(

గిరీష్ said...

@రాజ్,
హా అవును సరిగ్గా గుర్తుచేశావ్, కాగితాల బంతులతో టీములుగ విడిపోయి టెన్నీస్ అనీ/షటిల్ అనీ (అప్పుడూ మనకు తేడా తెలియదులే :)), తర్వాత దానికి ట్యూబులు చుట్టి జీరుబంతి ఆడే వాళ్ళం, పాపం రోజుకొకడు టార్గెట్.. :), పిచ్చకొట్టుడు అసలు, వీపు వాచిపోయేది..
ఇంకా తాటికాయ బండ్లు, దారం బుర్రకి మైనవు వత్తి తగిలించి ట్రాక్టర్ అని లారీ అనీ అబ్బో.. చాలా ఆడాం.
గూటీబిళ్ళ ఆడి నేను ఒకడికి తలమీద బొక్క కూడా పెట్టా.. :), thanks again.

మరచిపోయాం కాని ఇంకా చాలా ఉన్నాయ్... :)

భాస్కర రామిరెడ్డి said...

మీ టపాతో నేను కూడా నా బాల్యాన్ని గుర్తు చేసుకున్నానండి

మధురవాణి said...

@ గిరీష్,
మీరు చెప్పినన్ని ఆటలు ఆడలేదు గానీ.. పర్లేదు నేను కూడా బానే ఆడుకున్నాను చిన్నప్పుడు. అయితే మీ క్రికెట్ ఆల్బం లేదా ఇప్పుడు.. నేనింకా ముందు పేరాలో చదవగానే ఆ ఆల్బం ఫొటోస్ తీసి చూపెట్టండి మాక్కూడా అని అడుగుదాం అనుకున్నాను. :(

చిన్నప్పుడు బబుల్ గమ్స్ కొనుక్కుంటే క్రికెట్ కార్డ్స్ వచ్చేవి కదా ఫ్రీ గా.. ఆ బబుల్ గమ్స్ చెత్తలా ఉన్నా ఆ కార్డ్స్ కోసం కొనేవాళ్ళం.. నాకంత పిచ్చి లేదు గానీ మా తమ్ముడికి మహా పిచ్చి అవంటే.. చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకునేవాడు విలువైన ఆస్తి లాగా.. ఆ కార్డుల వెనకాల ప్లేయర్ కి సంబంధించిన స్టాట్స్ ఉంటాయి కదా.. అవన్నీ నోటికి వచ్చేవి వాడికి. వాటితో కూడా ఏదో ఆట ఉంటుంది. క్విజ్ లాగా ప్రశ్నలూ సమాధానాలు చెప్పడం.. ఉదాహరణకి సచిన్ బౌలింగ్ బెస్ట్ ఏంటి.. అలాగన్నమాట..

బోల్డు జ్ఞాపకాలు గుర్తు చేసారు.. థాంక్యూ.. నైస్ పోస్ట్.. :)

గిరీష్ said...

@భాస్కర రామి రెడ్డి గారు,
మీ బాల్యాన్ని గుర్తుకు తెచ్చినందుకు సంతోషం, ధన్యవాదాలు.

@మధుర వాణి గారు,
కికెట్ ఆల్బం లేదండీ.. :(,
హా అవునండీ బిగ్ బబూల్‌ని ఆ కార్డ్స్ కోసమే తినేవాళ్ళం, ఆ ఆటని మేము కికెట్ కార్డ్స్/ట్రంప్ కార్డ్స్ అనే వాళ్ళం. మీ తమ్ముడికి నా అభినందనలు తెలియవచేయండి...
Thanks for the comment..

గిరీష్ said...

@More Entertainment,
Thanks Dude.. :)

Anitha Chowdary said...

చిన్నపటివన్ని గుర్తుచేసారండి మీ పోస్ట్ తో .. భలే ఆడుకునేదాన్ని నేను ఇంట్లోవాళ్ళు వద్దన్నా చెప్పకుండా వెళ్లి వాళ్ళకి దొరకకుండా ఫుల్ గ ఆడి ఇంటికివచ్చి దెబ్బలు తినేదాన్ని కాని వెళ్ళడం మానేదాన్ని కాదు.. పరీక్షలు ఉన్నప్పుడైతే ఎప్పుడెప్పుడు పవర్ పోతుందా వెళ్లి ఆడుకుందాం అని చూసేదాన్ని ...

గిరీష్ said...

True, those days are golden days. Thanks for your comment.