Monday, June 20, 2011

ప్రేమ - పెళ్ళి (నా కథ) - 5


  ప్రేమ - పెళ్ళి (నా కథ) -4 కి తరువాయి
          విధంగా సంవత్సరం పరీక్షలు ముగించి వేసవి సెలవలు ముగించి మరలా హాస్టల్ బాట పట్టాను. ఇంతకు ముందు చెప్పినట్టు ఒక తుఫాను రానే వచ్చింది. తుఫాను మా సంగీత ఉపాధ్యయురాలిగారి రూపం లొ వచ్చింది. తుఫానుకు ముందు ప్రమాద ఘంటికలు విధంగా మా ప్ర. గారి ద్వారా వచ్చాయి. ఒక రోజు మాములుగా ఉదయం ప్రార్ధన జరుగుతుండగా, మా ప్ర. గారు ఒక ప్రకటన చేసారు : ఇందు మూలంగా యావత్ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా, మిమ్మలనందరినీ సకల కళా సారంగతులను (చోర కళ తప్ప) చేయడానికి మేము సంకల్పించాము. కావున మీకు ఒక చిత్రకళా ఉపాధ్యాయుడిని, ఒక సంగీత ఉపాధ్యాయురాలిని త్వరలో నియమించబోతున్నాము.కాబట్టి మీరందరూ అవకాశాన్ని ఉపయోగించుకొని రెండు కళలలోనూ నిష్ణాతులు కావాలి అని కోరుకొంటున్నాను.అని ముగించారు.
          మా అందరికీ ఏనుగెక్కినంత సంబరం వచ్చి ప్రతిఒక్కరూ ఒక్కో బాలమురళీక్రిష్ణ, ఒక రవి వర్మ లాగా ఊహించుకొని తరగతికి వెళ్ళాము. కాని మనకి కొంచం ఎక్కువకదా, రోజు తరగతులు అయిపోయాకా, గది కి వెళ్తూనే రంగుల కలలో మునిగిపోయా నేను ఒక చేత్తో గిటార్ వాయిస్తూ,ఒక చేత్తో రాంచరణ్ లాగా గోడ మీద రంగులు వేస్తూంటే...నా సామి రంగా..ఇప్పటి వరకు నా మీద కక్షకట్టిన అమ్మాయిలందరూ నా సంతకాల కోసం వెంటబడతారు (కాని నేను ఇవ్వననుకోండి). మన ప్రతిభ చూసి లోకానికి ఏమి బిరుదు ఇవ్వాలో తెలియక చివరకు, జింబాలవర్మపికాసో(జిం హెండ్రిక్స్,బాలమురళీక్రిష్ణ,రవి వర్మ మరియు పికాసోల) మేలుకలయిక అని బిరుదిచ్చారు.అలా బిరుదులు తీసుకొని గిటార్ వాయిస్తూ,బొమ్మలు వేసుకొంటుండగా ఒక్కసారిగా నా గిటార్ తీగ తెగి తలకు తగిలింది,ఇంతలో రంగు డబ్బా కూడా నెత్తి మీద పడడంతో నాకు మెలుకువ వచ్చింది.ఓహ్హ్హ్హ్..అనుకొని లేచి చూస్తే పడింది మా మాస్టారి దెబ్బ..అప్పుడు అర్ధమైంది, నేను తరగతిలో పడుకొని సాయంత్రం గదికి వెళ్ళి పడుకొన్నట్టు కలకన్నా!! ఓహ్ కలలో కలా సంగతి తెలిస్తే ఇన్సెప్షన్ సినిమా అప్పుడే వచ్చేసేది కదా. కలలకు కాపీరైటు ఉంటే అసలు క్రిస్ నోలన్(ఇన్సెప్షన్ దర్శకుడు) మీద కేసు వేసి ఈపాటికి కోటీశ్వరుణ్ణి అయ్యేవాడిని కదా.వా..ఎంత మంచి అవకాశం తప్పింది...హా..అయినా ఇప్పుడు వగచి ఏమి లాభం. మనం ప్రస్తుతంలోకి వద్దాం. ఒక పక్క నిద్ర మత్తు ఒక పక్క మాస్టారి పీకుడు కాని తప్పింఛుకోలేము కదా,ఏమి చేస్తాం రోజుకు తరగతులు అయ్యాయి అనిపించుకొని, అలాగే కాళ్ళు ఈడ్చుకొంటూ గదికిపోయా
          సాయంకాలం రాత్రి గా మారుతుండగా ఒక కారు వచ్చి ఆగింది అందులోంచి ముందు ఇద్దరు పిల్లలు దిగారు, వాళ్ళ వెనకాల వెనకాల పాత సినిమాలలో రమణా రెడ్డి లాగా రివట లాగా ఉన్న ఒకతను దిగాడు. ఆయన వెనకాల నిప్పు మీద వేసిన ఉప్పులాగా చిటపటలాడుతూ ఒకావిడ దిగింది. ఇంతకూ వారే మా సంగీత, మరియూ చిత్రకళా గురువిణి మరియూ గురువు గారూ.
          తరువాత రోజు మా పాఠాలు మొదలయ్యాయి, భోజనం తరువాత మొదటి సంగీత పాఠం మొదలైంది , అందరి చేతా ప్రార్ధన చెయ్యించి ఒక్కొక్కరి పేరు అడగటం మొదలుపెట్టారు, తరువాత ఎవరికి నచ్చిన పాట వాళ్ళు పాడాలి, కాని ఒక షరతు, పాట హుషారుగా ఉండాలి (హమ్మయ్య ఈవిడ చెప్పే పద్ధతి , ఈవిడ మొహం అంత చిరాకు కాదు అనుకొన్నా) అందరూ పాడుతున్నారు నా వంతు వస్తుంది ఏమి పాట పాడాలి అనుకొన్నా, ఇంతలో మా ఊరిలో పొయిన సెలవులలో జాతరకు వేసిన పాట గుర్తు వచ్చింది, వెంటనే అందుకొన్నా..నా మొగుడు రాం ప్యారి... (నిన్నే పెళ్ళాడుతా చిత్రంలోంచి పాడింది ఎవరో తెలియదు ).పాట అయిపోయింది.... ...అమ్మాయిలు అందరూ నవ్వేసుకొంటున్నారు, అబ్బాయిలు మామూలుగానే ఉన్నారు..ఏంటో అర్దం కాక మా గురివిణి గారి వైపు చూసా. ఆవిడ మొహం వంద సూర్యుళ్లని మింగినట్టు ఎర్రగా అయిపోయింది . నన్ను దగ్గరకు రమ్మన్నారు, వెళ్ళా తర్వాత జరిగింది ఏంటి అంటే....లక్ష్మి గణపతి ఫిలింస్ "మండే సూర్యిణి" చిత్రం విడుదల, మీ పాటశాలలో(పాఠశాల కాదు) అని మా స్కూల్ అంతా వినిపించింది..కాని సూర్యిణి కి మరీ దగ్గర ఉండటం వల్ల మాడింది నేను మాత్రమే. విషయం అర్ధమైంది కదా విధంగా మనకి పేలింది అన్నమాట. దెబ్బకి సంగీతం అంటే మౌనం అని తెలుసుకొన్నా. కాని మనసు ఊరుకోదు కదా .ఎలాగైనా జింబాలవర్మపికాసో అనిపించుకొవాలి..రాత్రీ పగలూ ఇదే ధ్యాస, ఈవిడేమో నన్ను చూస్తే శంకరాభరణంలో శంకరశాస్త్రి చంద్రమోహన్ ని చూసినట్టు చూస్తుంది.కానీ నేను వదులుతానా.
          మేడంగారూ, నా గొంతు అంత బాగోదు కాబట్టి, నాకు వేణువు గాని గిటార్ కాని నేర్పించండి అని ఆవిడ వెంటపడ్డా, కొద్ది రోజులు చూసారు.ఒక రోజు మండిపడి మండే సూర్యిణి-2 చూపించారు. తర్వాత చల్లబడి సంగీతానికి గాత్రం ప్రధానం (ఇది బాగా గుర్తుంచుకోండి), నువ్వు వేణువు, గిటార్ నేర్చుకోవడానికి చూపే ఆసక్తిలో సగం చూపు చాలు అన్నారు. నాకు నిజానికి ఇష్టం లేకపొయినా ఆవిడ విశ్వరూపం చూసి ఉండటం మూలాన ఒప్పుకొన్నా.వెంటనే ఆవిడ నువ్వు రోజూ ఉదయం 4:00 కల్లా మా ఇంటి దగ్గరకు వచ్చెయ్యి, సంగీతం సాధన చేద్దువు గాని అన్నారు
          తప్పుతుందా అనుకొంటూ తర్వాత రోజు ఆవిడ ఇంటి దగ్గర 4:00 కి దిగబడ్డా, ఆవిడ బయటకు వచ్చారు. ఒక్కసారి చుట్టూ చూసా, అసలే చలికాలం ఆవిడ ఇంటి పక్క గులాబి మొక్కలు పడుకొన్నాయి, నీళ్ళ తొట్టిలో నీళ్ళు కూడ పడుకొన్నాయి, ప్రాణులన్నీ పడుకొన్నాయి నేను మాత్రం చలిలో సంగీతం నేర్చుకొవడానికి..అదీ గాత్రం..హతవిధీ అనుకొని ఆవిడకు నమస్కరించా. ఆవిడ ప్రతి నమస్కారం చేశారు. పాఠం మొదలైంది.. అంటే షఢ్జమం అంటే నెమలి  కూత, రి అంతే రిషబం.....ని.... (నాకు)నిద్ర ముంచుకు వస్తుంది.అవి స్వరాలు అంటూ ఆవిడ ముగించారు, టక్కున నిద్రవదిలించుకోవలసి వచ్చింది. ఇప్పుడు స్వరాలను సాధన చేద్దాం అన్నారు.. సరే అనుకొని కాస్త శ్రద్ధ పెట్టా..కాని నా నిద్ర పూర్తిగా వదిలిపోయే సంఘటన అప్పుడు జరిగింది...

5 comments:

pallavi said...

Aaawwsoomm !! if i must say in a word..
superb comedy.. we want more of the series to come (in a faster pace) :)

pallavi said...

superb comedy..soo funny
Lovin it..
we want more to come ( at a faster pace) !!!

మనసు పలికే said...

హహ్హహ్హా.. సూపరు అంటే సూపరు.. భలే నచ్చింది టపా నాకు:) సరిగ్గా సమయానికి బ్రేక్ వేసారు కదా గిరీష్ గారూ;) ప్రపంచమంతా పడుకొన్న సమయంలో మీ సంగీత సాధన.. ఇక జింబాలవర్మపికాసో అయితే కెవ్వు కేక.. :)))))

kiran said...

అసలే మండే సూర్యుడు దగ్గరికొచ్చే సమయం
ఒకే సారి ఇద్దరు సుర్యభాగావనుల దర్శనం జరిగిందా ఏంటి.. :P
చాల బాగుంది ..నవ్వుకున్నా బాగా :)

గిరీష్ said...

@పల్లవి గారు,
Thank you for the comment, i will try :)

@అపర్ణ గారు,
:), ధన్యవాదములు.

@కిరణ్,
ఏమో చూద్దాం ఏమి జరుగుతుందో.. :), thanks.